Thursday 22 December 2016

నెల తిరగకముందే రెండో ముద్రణకు వెళ్ళిన "గుజరాత్ ఫైల్స్" పుస్తకం హైదరాబాద్ బుక్ ఫెయిర్, ఎన్ టీ ఆర్ స్టేడియం, ఇందిరాపార్క్, హైదరాబాద్ లో అందుబాటులో వుంది

ప్రచురించిన ఆరు నెలల్లోనే 18 భాషల్లోకి అనువాదమైన పుస్తకం "గుజరాత్ ఫైల్స్" 

 


"గుజరాత్ ఫైల్స్" పుస్తకం ఆవిష్కరించిన నెల రొజుల్లోనే ద్వితీయ ముద్రణకు వెల్లడం  విశేషం .

 ప్రస్తుతం ఈ పుస్తకం హైదరాబాద్ బూక్ ఫైర్ లో ఈ కింది స్టాళ్ళలో  లభిస్తోంది :

1) అరుణతార బుక్ స్టాల్ ..... నెం : 142, 143
2) వీక్షణం బుక్ స్టాల్ : నెం  : 92
3) నవయుగ బుక్ స్టాల్
4) నవ తెలంగాణ బుక్ స్టాల్ 
5) నడుస్తున్న తెలంగాణ  బుక్ స్టాల్ : నెం  :   37
6) మహిళా మార్గం  బుక్ స్టాల్    


ఈ స్టాళ్ళలో  "గుజరాత్ ఫైల్స్" పుస్తకం తో పాటు బేబి కాంబ్లె రచించిన "మా బతుకులు: దళిత స్రీ ఆత్మకథ పుస్తకం కూడా  లభిస్తుంది.

1) గుజరాత్ ఫైల్స్,  
రచన : రానా అయ్యూబ్, తెలుగు అనువాదం : ఎన్. రవి, 
ధర : రూ. 130/- 

2) మా బతుకులు దళిత స్త్రీ ఆత్మకథ, 

రచన: బేబి కాంబ్లే, తెలుగు అనువాదం : బి. అనురాధ, 
ధర : రూ. 130/- 



Friday 9 December 2016

ప్రచురించిన ఆరు నెలల్లోనే 18 భాషల్లోకి అనువాదమైన పుస్తకం "గుజరాత్ ఫైల్స్"

గుజరాత్ ఫైల్స్ పుస్తక రచయిత్రి
రానా అయ్యూబ్ తో సివిఎల్ ఎన్ ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ
ఆంధ్ర జ్యోతి (09-12-2016) సౌజన్యంతో
Link:

http://epaper.andhrajyothy.com/c/15217530



Thursday 8 December 2016

రానా అయ్యూబ్ "గుజరాత్ ఫైల్స్" పుస్తకావిష్కరణ సభ దృశ్యాలు, పత్రికా వార్తలు

నిన్న (08-12-2016) సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్ లో జరిగిన
రానా అయ్యూబ్ "గుజరాత్ ఫైల్స్"
పుస్తకావిష్కరణ సభ దృశ్యాలు, పత్రికా వార్తలు:


(Eenadu 9-12-2016)




Wednesday 7 December 2016

కల్లోల గుజరాత్ లో అపరాధ పరిశోధన !


ఈ రోజు (8-12-2016) సాయంత్రం 5-30 కి 
సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లిలో
 "గుజరాత్ ఫైల్స్" పుస్తకావిష్కరణ జరుగుతున్న సందర్భంగా 
ఇవాళ ఆంధ్ర జ్యోతి  ఎడిట్ పేజీలో ప్రచురించిన క్లిప్పింగ్ ఇది: 

సభలో పుస్తక రచయిత్రి  రానా అయ్యూబ్ స్వయంగా పాల్గొంటున్నారు.



Tuesday 6 December 2016

అమిత్ షా జైలుకు వెళ్ళడానికి కారణమైన కధనాలు : గుజరాత్ ఫైల్స్ పుస్తకావిష్కరణ సభ - 8 డిసెంబర్ 2016, గురువారం, సాయంత్రం 5-30కి, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్ లో

అమిత్ షా జైలుకు వెళ్ళడానికి కారణమైన కధనాలు :
"గుజరాత్ ఫైల్స్"  పుస్తకావిష్కరణ సభ -
 8 డిసెంబర్ 2016, గురువారం, సాయంత్రం 5-30కి, 
సుందరయ్య  విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి,  హైదరాబాద్ లో

Courtesy :Namaste Telangana 05-12-2016 


రచన: రానా అయ్యూబ్
తెలుగు అనువాదం : ఎన్. రవి
వెల: రూ. 130

ప్రతులకు, వివరాలకు :
 మలుపు,
2-1-1/5 ,
నల్లకుంట, హైదరాబాద్ - 500044

E MAIL ID : malupuhyd@gmail.com

Sunday 4 December 2016

''గుజరాత్‌ ఫైల్స్‌" ఆవిష్కరణ డిసెంబర్‌ 8న సాయంత్రం 5-30కి సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాల్లో

బ్లర్బ్‌:
గుజరాత్‌ ఫైల్స్‌
జర్నలిస్టు రానా అయ్యుబ్‌ ఎనిమిది నెలల పాటు అండర్‌ కవర్‌లో వుంటూ గుజరాత్‌ మత కల్లోలాలు, బూటకపు ఎన్‌కౌంటర్లు,  రాష్ట్ర హోంశాఖ మంత్రి హరేన్‌ పాండ్యా హత్య లను దర్యాప్తు చేసి బయటపెట్టి ఎన్నో విభ్రాంతికర విషయాల సమాహారమే గుజరాత్‌ ఫైల్స్‌. 

అమెరికన్‌ ఫిల్మ్‌ ఇనఇస్టిట్యూట్‌ కన్జర్వేటరీ నుండి వచ్చిన ఫిల్మ్‌మేకర్‌ మైథిలీ త్యాగిగా రానా గుజరాత్‌ రాష్ట్రంలో 2001-2010 మధ్య అత్యంత కీలక పదవుల్లో వున్న ఉన్నతాధికారులను, పోలీసు అధికారులను కలిసింది. రాజ్యం దాని అధికారగణం మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు చేయడంలో ఎట్లా భాగస్వాములయ్యాయో ఈ స్టింగ్‌ ఆపరేషన్‌ ద్వారా బయటపెట్టిన విషయాలు తెలుపుతాయి. 

నరేంద్ర మోదీ, అమిత్‌ షాలు అధికార శిఖరాలకు ఎగబాకటం కోసం
గుజరాత్‌ నుండి ఢిల్లీ దాకా వాళ్లు చేసిన ప్రయాణానికి సమాంతరంగా నడిచిన కేసుల గురించి ఎన్నో సంచలనాత్మక విషయాలను ఈ పుస్తకం బయటపెడుతుంది.

("గుజరాత్‌ ఫైల్స్‌ - ఎనాటమీ ఆఫ్‌ ఎ కవర్‌ అప్‌'' తెలుగు అనువాదం ''గుజరాత్‌ ఫైల్స్‌ ఆవిష్కరణ  డిసెంబర్‌ 8న సాయంత్రం 5-30కి సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాల్లో జరుగనుంది. 

అనువాదం: ఎన్‌. రవి. 
రానా అయ్యుబ్‌ ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ కార్యక్రమంలో కాత్యాయని, జహీద్‌ అలీ ఖాన్‌, జి.ఎస్‌.రామ్మోహన్‌, రమా మేల్కొటే, మహ్మద్‌ లతీఫ్‌ ఖాన్‌ వక్తలు. 
ప్రచురణ: 'మలుపు')

సాక్షి దినపత్రిక సాహిత్యం పేజి (05 డిసెంబర్‌ 2016)






   

Wednesday 30 November 2016

"గుజరాత్ ఫైల్స్" దుర్మార్గ పాలనపై రహస్య నేత్రం పుస్తకావిష్కరణ సభ - 8 డిసెంబర్ 2016, గురువారం, సాయంత్రం 5-30కి, సుదరయ్య విజ్ఞాన కేంద్రంలో

"గుజరాత్ ఫైల్స్"
దుర్మార్గ పాలనపై రహస్య నేత్రం
పుస్తకావిష్కరణ సభ - 
8 డిసెంబర్ 2016, గురువారం, సాయంత్రం 5-30కి, 
సుందరయ్య  విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి,  హైదరాబాద్ లో 
అందరికీ ఆహ్వానం 





రచన: రానా అయ్యూబ్
తెలుగు అనువాదం : ఎన్. రవి 
వెల: రూ. 130
ప్రతులకు, వివరాలకు : 
 
మలుపు, 
2-1-1/5 , 
నల్లకుంట, హైదరాబాద్ - 500044 


E MAIL ID : malupuhyd@gmail.com
 



Wednesday 23 November 2016

మూడు తరాల మహర్ మహిళల బతుకు పోరాట చిత్రణ : 'మా బతుకులు '

 మా బతుకులు పుస్తకానికి శ్రీ కె. సత్యనారాయణ రాసిన ముందుమాట :


దళిత స్త్రీ వాదాన్ని ఎత్తిపట్టిన మొదటి ఆత్మకథ

అంబేద్కర్‌ నడిపిన చారిత్రాత్మక దళిత ఉద్యమంలో తొలితరం మహిళా కార్యకర్త బేబికాంబ్లే. ఆమె రాసిన 'మా బతుకులు' తెలుగులోకి చాలా ఆలస్యంగా వస్తోంది. మరాఠీ దళిత సాహిత్యం నుంచి కొన్ని కవితలు, కథలు తెలుగులోకి వచ్చాయి

కానీ ఆత్మకథలు, నవలలు రాలేదు. ఆలస్యంగానైనా దళిత ఆత్మకథ తెలుగులోకి రావడం ఆహ్వానించదగినది. దళిత ఉద్యమం తెచ్చిన సామాజిక మార్పుని చిత్రించిన 'మా బతుకులు' వెలుగులోకి రావటమే ఒక చరిత్ర. బేబీ కాంబ్లే తన భర్తతో పాటు చిన్న కిరాణా షాపు నడుపుకునేది. పెద్దగా చదువుకోలేదు. అంబేద్కర్‌ ఉద్యమంలో పని చేసింది. తన జీవిత కాలంలో మహర్ల జీవితంలో వచ్చిన మార్పుల్ని తన అనుభవాల రూపంలో రాసింది. 1960లలోనే చాలా నోట్స్‌ పుస్తకాలు నింపేసింది. తన రాతలను భర్త చూస్తే అభ్యంతర పెడతాడని ఆ నోట్స్‌ పుస్తకాలని పాత పుస్తకాలు, పత్రికలతో పాటు అటకపై దాచేసింది. 1980లలో మహారాష్ట్రలో పరిశోధన చేయటానికి వచ్చిన సామాజిక శాస్త్ర పరిశోధక విద్యార్థి మాక్సీన్‌ బెర్నస్టీన్‌ బేబీ కాంబ్లేను కలిసింది. బేబీకాంబ్లే చెప్పిన ఉద్యమ అనుభవాల్ని విని, ఈ అనుభవాల్ని రాస్తే బాగుంటుందని అన్నది.

అది విన్న బేబీకాంబ్లే తాను ఎప్పుడో రాసానని చెప్పింది. బెర్నస్టీన్‌ ఆ పుస్తకాల్ని తెప్పించుకుని చదివింది. ఒక మహిళా పత్రికతో మాట్లాడి ఈ ఆత్మకథని 1982లో ధారావాహికంగా ప్రచురించడానికి సహాయపడింది. జీనా అమూచ 'మా బతుకులు' పేరుతో మరాఠీలో పుస్తకరూపంలో 1986లో వచ్చింది. మరాఠీ సాహిత్యంలో, బహుశా భారతీయ భాషల్లోనే దళిత మహిళ రాసిన మొదటి ఆత్మ కథగా దీన్ని చెప్పవచ్చు. ఈ పుస్తకాన్ని ''ది ప్రిజన్స్‌ వియ్‌బ్రోక్‌'' (మేము బ్రద్దలుకొట్టిన జైళ్ళు) పేరుతో 2008లో ఇంగ్లిష్‌లో ప్రచురించారు. 'మా బతుకులు' రాసిన తరువాత 20 ఏళ్ళకు మరాఠీ భాషలో పుస్తక రూపంలో వచ్చింది. మరో 20 ఏళ్ళ తరువాత ఇంగ్లిష్‌లో ప్రచురితమైంది. దళిత మహిళల అనుభవాలు,

ఆలోచనలు వెలుగులోకి రావటం ఎంత కష్టమో 'మా బతుకులు' ప్రచురణ చరిత్ర చదివితే, అర్థమవుతుంది.
ఆత్మకథ
మరాఠీ దళిత సాహిత్య చరిత్రలో ఆత్మకథా ప్రక్రియ ఒక విశిష్టతను సంతరించుకుంది. ఆత్మకథా ప్రక్రియ అనగానే ''ప్రముఖులు'', తత్త్వవేత్తలు, రాజకీయ నాయకులు, విద్యావంతులు, అందులోనూ పురుషుల వ్యక్తిగత జీవిత చరిత్రని రికార్డు చేసే రూపంగా మనకి తెలుసు. అరకొర చదువులతో, సాధారణ వ్యక్తులైన దళితులు తమ జీవిత చరిత్రలు రాసి ఆ మొదటి ప్రయత్నంతో రచయితలుగా ఎదిగారు. ఆత్మకథా ప్రక్రియ రూపురేఖల్ని మార్చి వేసారు. ఈ ప్రక్రియ చుట్టూ ఏర్పరిచిన సరిహద్దుల్ని చెరిపేసారు. సాధారణ దళితుల జీవితాన్ని కథా వస్తువు చేసారు. మరాఠీలో దయాపవార్‌ రాసిన 'బలూత' శరణ్‌ కుమార్‌ లింబాలే రాసిన 'అక్కర్‌ మాషీ' లాంటి ఆత్మకథలు సంచలనం సృష్టించాయి. సాధారణ వ్యక్తుల జీవిత చరిత్ర ద్వారా మొత్తం  దళితుల సామూహిక జీవన దృశ్యాన్ని చిత్రించే ప్రయత్నం చేసాయి. అయితే దళిత ఆత్మకథలు అగ్రకుల సమాజపు దౌర్జన్యం, ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ, సామాజిక మార్పు కోరడాన్ని చూపించాయి. ఈ కథలన్నీ దళిత పురుషుల దృష్టి కోణం నుంచి దళిత జీవితాన్ని, సమాజాన్ని విశ్లేషిస్తాయి. 'మా బతుకులు' దళిత మహిళ దృష్టికోణం నుంచి, దళిత మహిళల జీవితం కేంద్రంగా దళిత జీవితాన్ని, మొత్తంగా సమాజపు స్వభావాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. అగ్రకుల ఆధిపత్యంపై విశ్లేషణతో పాటు, దళిత సమాజంలో ఉన్న అసమానతల్ని, వివక్షా రూపాల్ని, హింసని కలిపి చిత్రించడం ఒక రచయితగా బేబీ కాంబ్లే సాధించిన విజయం. సమాజంలోని హింసా, దౌర్జన్యాలు, పితృస్వామ్య ధోరణులు, లింగ వివక్ష దళిత సమాజంలో కూడా ప్రతిఫలించిన తీరుని ఆమె విమర్శించారు. అందుకే మా బతుకులు దళిత స్త్రీ వాద దృక్పథం నుంచి రాసిన మొదటి ఆత్మకథగా చెప్పవచ్చు.

'మా బతుకులు'లో మహారాష్ట్రలో అంటరాని కులస్థులైన మహర్ల జీవితాన్ని రెండు భాగాలుగా విభజించి చూపించారు.

మొదటి భాగంలో మహర్ల సాంప్రదాయక సంస్కృతి, జీవితం, రెండవ భాగంలో అంబేద్కర్‌ ఉద్యమ వెలుగులో మహర్లు ఆధునికతవైపు అడుగులు వేయటాన్ని చూడవచ్చు. పేదరికం, అంటరానితనం, అజ్ఞానంతో బతుకుతున్న మహర్లు, అంబేద్కర్‌ ఉద్యమానికి, ఆలోచనలకి ఆకర్షితులై చైతన్యవంతులుగా ఎదిగి మానవ మర్యాద, ఆత్మగౌరవం సాధించుకున్నతీరు 'మా బతుకులు' ఇతివృత్తంగా చెప్పవచ్చు.

మహర్ల జీవితం

మహారాష్ట్రలోని పూనా సమీపంలో గల వీర్‌గాంవ్‌ గ్రామంలోని మహర్ల జీవితం గురించి బేబీకాంబ్లే రాసింది. ఆ గ్రామంలో తన అమ్మమ్మ గారి ఇంట్లో ఆమె పుట్టింది. వీర్‌గాంవ్‌ మహర్‌వాడ, అక్కడి మహర్‌ కుటుంబాల జీవిత చరిత్రను 'మా బతుకులు'లో చిత్రించింది. బేబీకాంబ్లే తన వ్యక్తిగత జీవిత వివరాల కంటే మహర్‌ కుల ప్రజల జీవిత చరిత్రకే ప్రాధాన్యత ఇచ్చింది. మహర్ల జీవిత చరిత్రలోనే ఆమె జీవిత చరిత్ర ఉందని ఆమె భావించింది.

అంటరానితనం, కులవివక్ష, పేదరికం, అజ్ఞానంలో బతుకుతున్న మహర్లు దుర్భరమైన జీవితాన్ని గడుపుతుంటారు. ప్రతి కుటుంబానికి 8 నుంచి 15 మంది పిల్లలు ఉంటారు. పూరి గుడిసెల్లో సరైన బట్టలు, వంట పాత్రలు లేకుండా జీవిస్తూ ఉంటారు. ఆనాటి  మహర్లని చూస్తే ''ఎలుకలు కొరికేసిన గుడ్డ బొమ్మల్లాగుంటారు. చిక్కులు పడిన వాళ్ళ జుట్టులో నిండుగా పేలు, ఈళ్ళతో నిండిపోయి ఉంటాయి. వాళ్ల పిల్లలు బురదలో పొర్లించినట్టున్నారు. ఆ పిల్లల ముక్కుల్లోంచి చీమిడి కారుతూ ఉంటుంది.'' అగ్రకుల పాటిల్‌, బ్రాహ్మణ తదితర అగ్రకులాల వారు మహర్లని కట్టు బానిసలుగా చేసుకున్నారు. వారి శ్రమను దోచుకుంటున్నారు. బ్రాహ్మణీయ భావజాలం తరతరాలుగా రుద్దబడడం వల్ల, మహర్లు ఆ భావజాలానికి పూర్తిగా బానిసలైపోయారు. తమను తాము బానిసలుగా భావించుకునే భావదాస్యంలోకి నెట్టబడ్డారు. తాము మనుష్యులమే అనే స్పృహ కోల్పోయారు.

మహర్‌ కులంలో మహిళలది చాలా కీలకమైన పాత్ర. కుల సంప్రదాయాలు, ఆచారాలు పాటించడంలో వారు చాలా నిష్టగా ఉంటారు. ఆషాడ మాసంలో జరిగే 'పవిత్ర' స్నానాలు, ఆచారాల గురించి చాలా వివరమైన, సుదీర్ఘమైన వర్ణనలు ఉన్నాయి. స్నానం తరువాత గోచిగుడ్డ, చింకిపాతల చీరలే, కొత్త దుస్తులుగా కట్టుకుంటారు. కాని సంప్రదాయ పద్ధతుల్ని, నియమాల్ని ఆచరిస్తారు. పండగలకు, జాతర్లకు అలంకరణ చేయడం, వంటలు, నైవేద్యం తయారు చేయడం నుంచి అమ్మవారిలా పూనకం ఊగే వరకు అన్ని రకాల మంత్రతంత్రాలు, తంతుల్లో మహర్‌ మహిళలు పాల్గొంటారు. ఇవే రకమైన తంతు, ఆచారాలు పెళ్ళిళ్ళ సమయంలో, బాలింతలకి పురుడు పోసేటపుడు మహర్‌ మహిళలు పాటిస్తారు. తమను తాము హిందువులుగా భావించుకునే మహర్‌ కులంలో సంప్రదాయాల్ని, మతాచారాలను పాటించి, కొనసాగించడంలో మహిళలదే ప్రధాన పాత్ర. ఒక ప్రక్క కుటుంబ పనులు, పిల్లల ఆలన పాలన చూసుకుంటూ, ఈ సంప్రదాయపు తంతులన్నీ ఆచరిస్తారు.

హిందూ సంప్రదాయాలను అరకొరగా ఆచరిస్తూ, భావదాస్యంలో మహర్లు మగ్గిపోతున్నారని చెప్పటానికి బేబీకాంబ్లే గత కాలపు మహర్ల ఆచారాన్ని, తంతుల్ని వివరంగా వర్ణించారు.  అగ్రకులాల్ని అనుకరించడంలో మహర్లలో పూర్తి అజ్ఞానం ఉందని, ఈ అజ్ఞానం పేదరికానికి తోడై తమను తాము తక్కువ వారిగా బానిసలుగా భావించునే స్థితిని రచయిత చక్కగా చూపించారు.

ఈ ఆత్మకథలో మూడు తరాల మహర్‌ మహిళలు కనిపిస్తారు. అమ్మమ్మలు / నాన్నమ్మలు, అమ్మలు / అత్తలు, కూతుళ్ళు / కోడళ్ళు. చిన్న వయస్సులోనే శ్రమకు, కష్టాలకు, అణచివేతకు గురయ్యే కూతుళ్ళు, కోడళ్ళ గురించి కొంత తెలుసుకోవాలి. మహర్‌ కులంలో అమ్మాయిలకు 7 లేదా 8 ఏళ్ళకే పెళ్ళయిపోతుంది. శారీరకంగా ఎదగకుండానే వారు గర్భవతులవుతారు... అనేక అనారోగ్య సమస్యలతో వారిలో చాలా మంది ప్రసవ సమయంలో చనిపోతారు. మంత్రసానుల నాటు పద్ధతుల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇక కోడళ్ళ పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. వేకువ

జామునే లేచి జొన్నలు దంచాలి. రొట్టెలు చేయాలి. నీళ్ళు మోసుకురావాలి. మొత్తం ఇంటి పనంతా కొత్త కోడలే చేయాలి.

అత్తగారు, ఆడపడుచులు, బావగార్ల తిట్లు, వేధింపులు భరించాలి. ఈ పని వత్తిడి, వేధింపులు భరించలేక కొందరు కొత్త కోడళ్ళు పారిపోతారు. వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చి కఠినంగా శిక్షిస్తారు. మహర్‌వాడలో ప్రతి ఇంటి నుంచి కోడళ్ళ ఏడుపులు, అరుపులు, ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉంటాయి. కొందరి తలలు పగలడం, ఎముకలు విరగడం, వారు స్పృహతప్పి పడిపోవడం సర్వసాధారణం.

మహర్‌ జీవిత చిత్రణలో తన జ్ఞాపకాల్ని అనేక దృశ్యాలుగా, వివరమైన వర్ణనలతో చూపించారు. సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్ల గురించి, పెళ్ళిళ్ళలో మిగిలిన ఆహారం తినడం, చచ్చిన గొడ్డు మాంసాన్ని దాచుకుని రోజుల తరబడి తినడం, ఆకలితో చావలేక బ్రహ్మజెముడు కాయలు తిని కడుపు పాడై ఇబ్బందులకు గురి కావడంలాంటి అనేక విషయాల్ని బేబికాంబ్లే విపులంగా వర్ణించారు. ఇలాంటి బతుకులపై వ్యాఖ్యానం, వివరణ, అభిప్రాయాల ప్రకటన కంటే వివిధ దృశ్యాలను వర్ణించడమే తన రచనా పద్ధతిగా ఎన్నుకున్నారు. ఈ పద్ధతి వల్ల మహర్ల అమానవీయ బతుకును బాగా చూపడం, ఆ బతుకుల్ని మార్చే చైతన్యాన్ని ఇచ్చిన అంబేద్కర్‌ ఉద్యమాన్ని ఎత్తిపట్టడం బేబీకాంబ్లే ఉద్దేశ్యం కావచ్చు. అందుకే - మహర్లు  తోకలేని జంతువులుగా బతికారని అంటుంది.

మనమూ మనుషులమే

''జంతువులుగా జీవిస్తున్న వారిని మనుషులు''గా అంబేద్కర్‌ మార్చారని బేబీకాంబ్లే అంటుంది. చిన్న బాలికగా ఉన్నపుడు అంబేద్కర్‌ ఒక సమావేశంలో చేసిన ప్రసంగాన్ని బేబీకాంబ్లే విన్నది. ఆయన మాటల్ని ఆచరణలో పెట్టింది.

అంబేద్కర్‌ ''మనమూ మనుషులమే. మనకూ మనుషులుగా జీవించే హక్కు'' ఉందని ప్రకటించారు. ఆత్మగౌరవంతో బతకలేకపోతే చావడం మేలన్నాడు. చచ్చిన గొడ్డు మాంసాన్ని తినవద్దన్నాడు. తిండిలేక కొందరు చనిపోయినా, బతికిన వారు గౌరవంగా, మర్యాదతో బతుకుతారని అన్నాడు. ఈ బానిస బతుకు మనపై రుద్దబడింది. ఇది పోవాలంటే పోరాటం తప్పదన్నాడు. ముఖ్యంగా ఈ విప్లవాత్మక సంస్కరణలో మహిళలే ముందుండాలి అన్నాడు. జాతిని మేల్కొలిపి, పోరాటాల ద్వారా చైతన్యపరిచి మహర్‌ కుల ప్రజల్ని ఆధునికత వైపు నడిపించాడు. ఈ ఆత్మకథలో అంబేద్కర్‌ ఒక పాత్రగా చారిత్రక వ్యక్తిగా ఉద్యమ ప్రతీకగా కనిపిస్తారు. అంబేద్కర్‌ సందేశం 1940ల్లో మహర్‌ కులస్థులలో పెద్ద దుమారం లేపింది.

విదేశాల నుంచి వచ్చాడు, క్రిష్టియన్‌గా మారి అంబేద్కర్‌ మైలపడ్డాడని కొందరు మహర్‌ పెద్దలు ఆయన సందేశాన్ని వ్యతిరేకించారు. అంబేద్కర్‌ సందేశం మెల్లగా మార్పుకి దారి తీసింది. పిల్లలకి పైజామాలు తొడగడం, క్రాపు చేయించడం, వారిని స్కూలులో చేర్పించడం లాంటి పనులన్నీ మొత్తం మహర్‌ కుల సమాజాన్ని ఆధునీకరించింది. ఈ అంటరాని బతుకులు తమ తలరాత కాదని, ఖర్మ అసలే కాదని మహర్లు తెలుసుకున్నారు. మనుషులుగా మర్యాదను పొందారు. ఈ పోరాటంలో బేబీ కాంబ్లే లాంటి ఎందరో మహిళలు ముఖ్యమైన పాత్ర పోషించారు.

అంబేద్కర్‌ జయంతినాడు తెల్లని బట్టలు ధరించి ఆత్మగౌరవంతో నడుస్తూ కొత్త మనుషుల్లా మహర్‌లు కనిపించడంతో కథ ముగుస్తుంది. కొస మెరుపుగా, చుదువుకున్న దళితులు స్వార్థంతో జాతిని విచ్ఛిన్నం చేస్తున్నారని, అంబేద్కర్‌ ఆశించింది ఇదేనా? అని బేబి కాంబ్లే ప్రశ్నిస్తుంది.

అంబేద్కర్‌ హిందూ మతాన్ని, బ్రాహ్మణీయ భావజాలాన్ని వ్యతిరేకించి, పోరాడాడని మనకు తెలుసు. కానీ 'మా బతుకులు'లో బ్రాహ్మణీయ భావజాలాన్ని పూర్తిగా జీర్ణించుకొని, తమను తాము బానిసలుగా భావించుకునే మహర్‌ కుల స్థుల మనస్సుల్లో అంతర్భాగమైన అజ్ఞానాన్ని, న్యూనతాభావాన్ని, భావదాస్యాన్ని సమూలంగా తొలగించడాన్ని ఇతివృత్తంగా తీసుకున్నారు. అగ్రకులాల అణచివేత ప్రస్తావన ఉంటుంది కాని అగ్రకులాలతో ఘర్షణలు, పోరాటం ఈ పుస్తకంలో ప్రధానం కాదు. మహర్‌ల మానసిక, సాంస్కృతిక, భావజాల బానిసత్వాన్ని తొలగించడంలో అంబేద్కర్‌ విప్లవాత్మక పాత్ర నిర్వహించారు. బేబీ కాంబ్లే లాంటి అనేక మంది మహర్‌ మహిళలు అంబేద్కర్‌ ఉద్యమంలో నిర్వహించిన చారిత్రాత్మక కర్తవ్యాన్ని 'మా బతుకులు' ఎత్తి పట్టింది.బేబీ కాంబ్లే చేయి తిరిగిన రచయిత కాదు. కానీ ఈ పుస్తకం చదివితే అలా అనిపించదు. వివిధ దృశ్యాల చిత్రణలో, వర్ణనలో, వ్యంగ్య వాఖ్యానాల్లో ఆమె రచనా పటిమ కనిపిస్తుంది. మహిళా దృష్టి కోణం నుంచి కథ నడిపించి ఆత్మకథా ప్రక్రియను పునర్నిర్వచించడంలో బేబీ కాంబ్లే ప్రతిభ గొప్పది. సరళమైన మంచి తెలుగులో అనువదించి 'మా బతుకులు' తెలుగు పాఠకులకి అందించిన అనూరాధ గారికి, ప్రచురించిన మలుపు ప్రచురణల వారికి ప్రత్యేక అభినందనలు.


- కె. సత్యనారాయణ
ఇ.ఎఫ్‌.ఎల్‌. యూనివర్సిటీ,
హైదరాబాద్‌.
30/10/2016

అనువాదం : బి. అనురాధ
వెల : రూ. 130  


ప్రతులకు, వివరాలకు : 
 
మలుపు, 
2-1-1/5 , 
నల్లకుంట, హైదరాబాద్ - 500044 


E MAIL ID : malupuhyd@gmail.com

Tuesday 22 November 2016

డా.బి.ఆర్.అంబేడ్కర్ తో కలసి పనిచేసిన ఒక దళిత స్త్రీ ఆత్మకథ "మా బతుకులు"



మా బతుకులు
ఒక దళిత స్త్రీ ఆత్మకథ

మాకు నాలుగు కాళ్లు కాక
రెండే కాళ్లు వుండటం వల్ల మాత్రమే మమ్మల్ని మనుషులు అనవలసి వస్తోంది.

వాళ్ల పెరట్లో కట్టేసి వుంచే ఎద్దుల కంటే హీనమైన పరిస్థితికి మమ్మల్ని దిగజార్చారు.
కనీసం ఎద్దులకి ఎండుగడ్డయినా వేస్తారు.
మాకు మాత్రం ఎంగిలి మెతుకులే గతి.

అయితే తేడా ఏంటంటే ఎడ్లు కడుపునిండా తిని వాళ్ళ యజమానుల పెరటిలోనే వుంటాయి.
మేము ఉండేది ఊరవతల పెంటకుప్పల్లో.

అగ్రకులాలు ఆ పెంటకుప్పల మీదికి విసిరేసే చచ్చిన జంతువులకి మాత్రమే మేము యజమానులం.
ఆ జంతువుల చర్మాలని ఒలిచే హక్కుని నిలబెట్టుకోడానికి మేము కుక్కలతోటి, పిల్లులతోటీ, గెద్దలతోటీ, రాబందులతోటీ కొట్లాడాలి.

ప్రపంచం నిలబడి వుండటానికి కారణం మాత్రం మేమే.
పర్వతాలను సైతం తనలో దాచుకోగలిగే అనంత సముద్రం లాగా అగ్రకుల పాపాల పర్వతాలను కప్పి వుంచే సముదాల్ర వంటి వారం మేము.

అందుకే సముద్రానికి దక్కినట్టే ప్రపంచపు మొత్తం ఆరాధన మాకు దక్కాలి!

- బేబి కాంబ్లే
(ఈ పుస్తక రచయిత్రి)



ముద్రణ లో వున్న ఈ పుస్తకం గురించిన మరిన్ని వివరాలు త్వరలో

అనువాదం : బి. అనురాధ
వెల : రూ. 130  

ప్రతులకు, వివరాలకు : 
 
మలుపు, 
2-1-1/5 , 
నల్లకుంట, హైదరాబాద్ - 500044 


E MAIL ID : malupuhyd@gmail.com

Sunday 20 November 2016

గుజరాత్‌లో 2002లో జరిగిన కల్లోలభరిత ఘటనలకు, బూటకపు ఎన్‌కౌంటర్లకు సంబంధించిన పుస్తకం: "గుజరాత్ ఫైల్స్"


ముందుమాట 

హిరణ్మయేన పాత్రేణ సత్యసాపిహితం ముఖం!
సత్యం పూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే!!
(సత్యం యొక్క ముఖాన్ని స్వర్ణ పాత్ర కప్పేసింది;
సత్యపూరిత ధర్మసందర్శనం కోసం ఓ పుషన్‌! దాన్ని తొలగించు)
- ఈశ్వరోపనిషత్తు

''సత్యం కల్పనకన్నా వింతైనది.
ఎందుకంటే, కల్పన తప్పనిసరిగా సాధ్యాసాధ్యాలకు కట్టుబడి ఉండవలసి వస్తుంది.
కానీ సత్యం కాదు-'' అని మార్క్‌ట్వైన్‌ వ్యాఖ్యానించాడు.

కానీ సత్యం యొక్క స్వభావం యుగాలుగా తత్వవేత్తలను
అబ్బురపరుస్తూనే ఉంది.
'పవిత్ర కలశం' (కళిజిగి స్త్రజీబిరిజి) లాగా దాన్ని విభిన్న వ్యక్తులు విభిన్న సమయాల్లో,
పరిస్థితుల్లో రకరకాలుగా దర్శించారు.
 ఏకాగ్రచిత్తులై సత్యాన్ని శోధించే వాళ్ళు మాత్రం యితరుల సహాయాన్ని
ఆశించకుండా తమ చైతన్యమే తమకు మార్గదర్శనం చేస్తుంటే, కష్టాలు, విపత్తులతో కూడిన మార్గంలో ఒంటరిగా
ప్రయాణించవలసి ఉంటుంది.

గుజరాత్‌లో 2002లో జరిగిన కల్లోలభరిత ఘటనలకు, బూటకపు ఎన్‌కౌంటర్లకు సంబంధించి ఈ పుస్తకంలో వివరించిన సత్యాన్ని గురించిన పఠనం చాలా ఆసక్తికరంగా సాగుతుంది.

సుదీర్ఘకాలం పాటు సాగిన 'స్టింగ్‌' ఆపరేషన్‌లో విరివిగా ఉపయోగించిన రహస్య కెమెరాలు, రహస్య మైక్రోఫోన్‌లు అందించిన సమాచారంతో ఈ పుస్తకం పాఠకులకు లోతైన అవగాహన కలిగిస్తుందని రచయిత అభిప్రాయం. ఈ పుస్తకంలో ముందుకు తెచ్చిన సమాచారం వాస్తవాలను ప్రతిబింబిస్తున్నదా లేక ఆ ఘటనలకు సంబంధించి రచయిత దృక్పథమా అనేది నిర్ణయించుకోవలసిన నిర్ణేతలు మాత్రం పాఠకులే.

ప్రత్యక్ష సంభాషణలతో కూడిన కథనం వల్ల పఠనం ఆసక్తికరంగా సాగుతుంది. ఇక్కడ ఉల్లేఖించిన వాస్తవాలు ఏ మేరకు నిజమైనవనేది నిర్ణయించి ఈ దేశపు పౌరులకు చట్టబద్ధ పాలనలో విశ్వాసం పునరుధ్ధరించడానికి అవసరమైన చర్యచేపట్టవలసింది మాత్రం చట్టబద్ధ పాలనను అమలు చేయవలసిన అధికార యంత్రాంగమూ, ఆ చట్టానికి కాపలాగా నిలబడవలసిన రాజ్యాంగ యంత్రాంగమే.

ముంబయ్‌లో డిసెంబర్‌ 1992-జనవరి 1993 మధ్య జరిగిన మతకల్లోలాలు, హింసాత్మక ఘటనల గురించి
ఏర్పాటయిన విచారణా కమిషన్‌ జరిపిన విచారణ సందర్భంలో నాకు కలిగిన బాధాకరమైన అనుభవం, అటువంటి
కల్లోలాల బాధితుల పట్ల చాలా స్పష్టంగా కనిపించిన ఉపేక్షాభావం వలన నాకు అనిపించేదేమంటే - ఇటువంటి కల్లోలాలకు గల కారణాలను తెలుసుకోవడంలో, అవి పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టడంలో రాజ్య యంత్రాంగం, రాజ్యాంగ అధికారులు మరింత గంభీరమైన ప్రయత్నం చేయవలసి ఉంది.

ఈ పుస్తకంలో వర్ణించిన వాటన్నింటి నిజానిజాలను నిర్ధారించడం మనకు సాధ్యం కాకపోయినప్పటికీ రచయిత తాను సత్యమని నమ్మిన దాన్ని బయటపెట్టడానికి చేసిన ప్రయత్నాల్లో ప్రదర్శించిన ధైర్యసాహసాలను, అంకిత భావాన్ని ప్రశంసించకుండా ఉండలేం. ఆమెకూ, పరిశోధనాత్మక జర్నలిజంలో ఆమె సాహస యాత్రకూ అభినందనలు.

నిజాయితీరాహిత్యం, రాజకీయ చాణక్యం, మోసం పెరుగుతున్న ఈ రోజుల్లో పైవాటి అవసరం పెరుగుతున్నట్టే ఉంది.
                               
-  బి.ఎన్‌.శ్రీకృష్ణ


గుజరాత్ ఫైల్స్

దుర్మార్గ పాలనపై రహస్య నేత్రం
- రానా అయ్యూబ్ 

వెల: రూ. 130

ప్రతులకు, వివరాలకు : 

 
మలుపు, 
2-1-1/5 , 
నల్లకుంట, హైదరాబాద్ - 500044 


E MAIL ID : malupuhyd@gmail.com


Phone : 040 2767 8411
 

 


Friday 18 November 2016

గుజరాత్ ఫైల్స్ పుస్తకం ఇప్పుడు అన్ని ముఖ్యమైన పుస్తకాల షాపుల్లో లభిస్తోంది . ధర కేవలం 130 రూపాయలే!


ఆంధ్ర జ్యోతి ఎడిటర్ శ్రీ కె. శ్రీనివాస్ ఈ పుస్తకానికి  రాసిన ముందుమాట: 




అనధికార చార్జిషీట్‌
ఈ పుస్తకం చదవడం ఒక హింసాత్మక అనుభవం.
వాక్యాల వెంట నడుస్తుంటే గుండె వేగంగా కొట్టుకుంటుంది.
 పేజీలు తిప్పుతుంటే, వేళ్లు వణుకుతాయి.
అంతులేని నిస్త్రాణ ఆవరించి, పుస్తకం పూర్తయ్యేసరికి భయభ్రాంతులమవుతాము.
రచయిత ప్రదర్శించిన అద్భుత రచనాశైలో, ఉత్కంఠ నింపిన కథనమో అందుకు కారణం కాదు. నిజానికి రచనాపద్ధతిలో పెద్ద విశేషం ఏమీ లేదు. పాఠకులను కల్లోలపరిచేది ఇందులోని విషయమే. అట్లాగని, ఆ విషయం కొత్తదీ కాదు, ఇంతకు మునుపు మన ఊహల్లో అంచనాల్లో లేనిదీ కాదు.

రానా అయ్యూబ్‌ పుస్తకం 'గుజరాత్‌ ఫైల్స్‌' ఇటీవలి దేశచరిత్రకు సంబంధించిన అతి కీలకమయిన పరిణామాలను విస్ఫోటనాత్మకంగా స్పృశించింది. 2002లో గుజరాత్‌లో జరిగిన మారణకాండ, దాని తరువాత ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్లు, వాటితో ప్రమేయం ఉన్న రాజకీయ వ్యక్తులు జాతీయ స్థాయి నాయకులుగా ఎదగడం - వీటిని ఈ పుస్తకం ఒక దృక్కోణంలో కథనం చేసింది.

పరిశోధనాత్మక కథనాలకు ప్రసిద్ధి చెందిన పత్రిక 'తెహెల్కా' ఉద్యోగిగా అనేక సంచలనాత్మక సత్యాలను వెలికితెచ్చిన యువపాత్రికేయురాలుగా రానా అయ్యూబ్‌ ప్రసిద్ధురాలు. అమిత్‌షా జైలుకు వెళ్లడానికి కారణమయిన కథనాలు కూడా ఆమెవే. గుజరాత్‌ గురించిన మరిన్ని స్పష్టమైన వాస్తవాలను వెలికితీయడానికి ఆమె 2010-11 మధ్యకాలంలో ఆ రాష్ట్రం వెళ్లి మారు పేరుతో, ఔత్సాహిక చిత్రనిర్మాతగా నటిస్తూ ఎంతో ప్రమాదకరమైన పరిశోధన జరిపారు. 2002 మారణకాండ, అనంతర సంఘటనల కాలంలో కీలకమైన బాధ్యతలలో ఉన్న అధికారులతో, ప్రజాప్రతినిధులతో ఆమె మాట్లాడారు.

పరిశోధన నరేంద్రమోదీ దాకా చేరిన సమయంలో, 'తెహెల్కా' రానాను వెనక్కు రప్పించింది. ఆమె చేసిన స్టింగ్‌ ఆపరేషన్‌ల కథనాలను ప్రచురించడానికి నిరాకరించింది. మరే పత్రికా, వార్తా ఛానెల్‌ కూడా ఆమె కథనాలను స్వీకరించలేదు. చివరకు తన పరిశోధనను తానే పుస్తకంగా ప్రచురించి, ఈ ఏడాది మేలో విడుదల చేసింది.

పుస్తకం బయటికి వచ్చిన తరువాత కూడా ప్రధాన మీడియా అంతా మౌనమే పాటించింది. ప్రత్యామ్నాయ వేదికలుగా ఉన్న కొన్ని వార్తా వెబ్‌సైట్లు మాత్రమే కొంత పట్టించుకున్నాయి. విస్మరించడం ద్వారానే ఈ పుస్తకంలోని అంశాలను పూర్వపక్షం చేయగలమని నిందితులు కూడా భావించారు.

ఇంగ్లీషు మూలం 'గుజరాత్‌ ఫైల్స్‌: అనాటమీ ఆఫ్‌ ఎ కవర్‌ అప్‌'ను 'ఫస్ట్‌పోస్ట్‌'లో సమీక్షించిన ప్రదీప్‌ మీనన్‌ అనే పాత్రికేయుడు ఇట్లా రాశాడు. ''సూక్ష్మ వివరాల్లోనే దేవుడుంటాడని అంటూ ఉంటారు. వేర్వేరు దేవుళ్లకు చెందిన వారు రానా అయ్యూబ్‌ పుస్తకంలోని సూక్ష్మవివరాలను వేర్వేరుగా చదువుకుంటారు. అయినా సరే, ఈ పుస్తకంలో పూసగుచ్చిన సూక్ష్మాతిసూక్ష్మమైన వివరాలే మీ దృష్టిని కట్టిపడేస్తాయి.''

నిజమే, ఈ పుస్తకంలో చిన్న చిన్న సంగతులు, ముచ్చట్లే ముఖ్యమైనవి. అవే మనకు ఒక సారాంశాన్ని గాఢంగా బట్వాడా చేస్తాయి. తాను సేకరించిన సమాచారాన్ని, జరిపిన సంభాషణల్ని పుస్తకంగా రూపొందించే క్రమంలోను, రాయడంలోను రానా అయ్యూబ్‌ ప్రత్యేకమైన ప్రతిభ ఏమీ చూపలేదు. మారుపేరుతో ఒక కొత్త ఉనికిని స్వీకరించేటప్పుడు ఎదురయిన ఇబ్బందులు, అన్ని అవరోధాలను విజయవంతంగా అధిగమించినప్పటి విశేషాలు... ఒక్కో సంభాషణ తరువాత తనలో కలిగిన భయోద్విగ్నత - ఈ పుస్తకానికీ నాటకీయతను, ఉత్కంఠను జోడించాయి. వాటి వల్ల పఠనీయత కొంత పెరిగి ఉండవచ్చును కానీ, రానా అయ్యూబ్‌ జరిపిన స్టింగ్‌ సంభాషణలే ఈ పుస్తకానికి ప్రాణం.

గుజరాత్‌ హింసాకాండ సమయంలో హోమ్‌ సెక్రటరీగా పని చేసిన అశోక్‌ నారాయణ్‌, ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న జి.సి. రాయిగర్‌, ఒక దళిత ఐఎఎస్‌ అధికారి రాజన్‌ ప్రియదర్శి, హింసాకాండ సమయంలో దుండగుల మూకకు నాయకత్వం వహించినట్టు అభియోగం ఉన్న మాయా కొడ్నానీ, గుజరాత్‌ ఎటిఎస్‌ చీఫ్‌గా పనిచేసిన జి.ఎల్‌. సింఘాల్‌, 2002లో అహ్మదాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌గా ఉండిన పి.సి. పాండే, నాడు రాష్ట్ర పోలీసు డిజిగా పనిచేసిన చక్రవర్తి - వీరందరితోనూ రానా అయ్యూబ్‌ గుజరాత్‌పై తాను నిర్మించాలనుకునే చిత్రం కోసమని చెప్పి ముచ్చటించారు.

ఈ సంభాషణల్లో గుజరాత్‌ హింసాకాండ నేపథ్యం, నరేంద్రమోదీ, అమిత్‌షా పాత్ర ఏ మేరకు ఉన్నది, 2002 తరువాతి కాలంలో జరిగిన అనేక ఎన్‌కౌంటర్ల పూర్వాపరాలు, సూత్రధారులకు, పాత్రధారులకు ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూ పరిషత్‌లలో ఉన్న ప్రాబల్యం - వంటి అంశాలు అనేకం ప్రస్తావనకు వచ్చాయి.

వీరిలో కొందరికి నాడు జరిగిన పరిణామాలపై అసంతృప్తీ, వ్యతిరేకతా ఉన్నాయి. అందువల్ల వారు ఇబ్బందులు కూడా పడ్డారు. పనిలో పనిగా ఈ సంభాషణలు, పోలీసు వ్యవస్థలోని కులవివక్షను కూడా చెబుతాయి. ఒక ప్రత్యేకమైన సామాజిక భావధోరణి ఉన్న రాజకీయ నాయకులు అధికారంలో ఉండగా, రాజ్యయంత్రాంగం వారికి ఎట్లా అనుకూలంగా వ్యవహరిస్తుందో, ఆ యంత్రాంగమే ఆ భావధోరణికి ఎట్లా ప్రభావితమవుతుందో, మనుషుల ప్రాణాలపై వారికి ఉండిన పట్టింపు ఎంతో, మొత్తంగా ఆ క్రమం, దేశ రాజకీయ వాతావరణంలో ఏ మార్పులు తెచ్చి, ఎటువంటి అధికార మార్పిడికి కారణమవుతుందో - ఆ సంభాషణలు చదువుతుంటే పాఠకులకు అంచనా కలుగుతుంది.

స్టింగ్‌ ఆపరేషన్‌ ద్వారా వాస్తవాలను రాబట్టడం పాత్రికేయ రచనలో ఉత్తమమైన ధోరణి కాదన్న అభిప్రాయం ఉన్నది. ఎదుటివారిని మభ్యపెట్టి, సమాచారాన్ని రాబట్టడం కానీ, అనైతికతకు ప్రలోభపెట్టి కెమెరాకు పట్టించడం కానీ అన్నివేళలా ఉదాత్తమైన మార్గాలు కాకపోవచ్చు. కెమెరా ముందు గానీ, రికార్డర్‌ ముందు గానీ చెప్పిన విషయాలు, ఆ వ్యక్తులు న్యాయస్థానాల్లో ప్రమాణపూర్తిగా తిరిగి చెబుతారా అన్నది ఒక ప్రశ్న. అట్లా చెప్పకపోతే, ఆ సమాచారానికి ఉన్న చట్టబద్ధ విలువ ఏమిటన్నది సందేహం. అయితే, సత్యాన్ని వెలికితీయడానికి అంతకు మించిన మార్గం లేనప్పుడు గత్యంతరం ఏమిటి? ఇటువంటి పుస్తకం పెద్ద సంచలనం తెచ్చి, న్యాయస్థానాలు తమంతట తాము ఇందులోని విషయాలను పరిగణనలోకి తీసుకుని మొత్తంగా విచారణ జరపమని ఆదేశించగలవా? రానా అయ్యూబ్‌ ఆ ఫలితాన్ని ఆశించారా? ఆశించి ఉండకపోవచ్చు. హింసాకాండపైన, ఎన్‌కౌంటర్లపైన న్యాయస్థానాల్లో ఉన్న వ్యాజ్యాలు విఫలమవుతున్న నేపథ్యంలో తమ పరిశోధన కనీసం వాస్తవాలను రికార్డు చేస్తుందని ఆమె ఆశించి ఉంటారు.

మైనారిటీలపై పెద్ద ఎత్తున హింసాకాండకు పాల్పడుతున్న మూకలను చూసీ చూడనట్టు వదిలివేయమని నాటి ముఖ్యమంత్రి ఆదేశించారా? అంటే, అటువంటి ఆదేశాలు నేరుగా కానీ, లిఖితపూర్వకంగా కానీ ఉండవని, అటువంటి సందేశం తగినవారికి అందేట్టుగా వ్యవహారం నడుస్తుందని ఇందులో ఇద్దరు ముగ్గురు అధికారులు చెప్పారు. ఇక అటువంటి వాటికి కోర్టులు ఆమోదించే సాక్ష్యం ఏముంటుంది? పాఠకులకు విషయం అర్థం కావడమే ఇటువంటి పరిశోధనల ప్రయోజనం. న్యాయస్థానాల్లో నిర్ధారణ కాకపోయినా, ఈ పుస్తకం ఒక తీర్పు వంటిదే. ఈ తీర్పుకు చట్టబద్ధమైన శిక్ష ఉండదు కానీ, పాఠకుల దృష్టిలో అభియోగాల నిర్ధారణ జరిగినట్టే. ఒక చారిత్రక పత్రంగా ఇది వర్తమాన భారత చరిత్రకు సంబంధించిన కొన్ని ఘట్టాల నేపథ్యాన్ని, వాటి పర్యవసనాల్ని ఒక నిర్దిష్టమైన దృక్పథంతో అందిస్తుంది. చరిత్ర ఉన్నంత కాలం, కొన్ని నేరాలకు సంబంధించిన 'ప్రామాణికమైన' కథనంగా నిలుస్తుంది. ఈ దృష్టిలో చూసినప్పుడు రానా అయ్యూబ్‌ విజయవంత మయ్యారు.

స్వతంత్ర భారతదేశంలో అత్యంత అమానవీయమైన, క్రూరమైన హింసాకాండగా పేరు పొందిన గుజరాత్‌ ఘాతుకం నేపథ్యాన్ని ఒకసారి గమనించాలి. కేశూభాయ్‌ పటేల్‌ను దించివేసి, అసెంబ్లీకాలం మధ్యలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోదీ ప్రతిష్ఠితులయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయిన కొద్ది కాలానికే గుజరాత్‌ హింస జరిగింది. ఆ తరువాత కొద్ది నెలలకే ఎన్నికలు జరిగి, మోదీ ఘనవిజయం సాధించారు.

ఆ ప్రభుత్వంలో హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న అమిత్‌షా తమ ప్రాబల్యాన్ని వేగంగా పెంచుకోసాగారు. ఆ సమయంలోనే హోంమంత్రి హరేన్‌ పాండ్య హత్య జరిగింది. ఆ హత్యకు కారకులు ముస్లిం తీవ్రవాదులని చెబుతూ అనేక అరెస్టులు జరిగాయి. గుజరాత్‌ హింసకు ప్రతీకారంగా మోదీ హత్యకు ప్రయత్నిస్తున్నారనే పేరుతో అనేక ఎన్‌కౌంటర్లు జరిగాయి. అందులో ఇష్రాత్‌ జహాన్‌ అనే యువతి ఎన్‌కౌంటర్‌, సొహ్రాబుద్దీన్‌ అనే చిన్న నేరుస్తుడి ఎన్‌కౌంటర్‌ సంచలనం సృష్టించాయి. సందేహాస్పదమైన ఎన్‌కౌంటర్లతో జాతీయస్థాయిలో వివాదం చెలరేగింది. అమిత్‌ షా అరెస్టు జరిగింది. తరువాత దీర్ఘకాలం ఆయనను గుజరాత్‌లో ప్రవేశించకుండా నిరోధించడం జరిగింది. గుజరాత్‌ హింసాకాండ నేపథ్యంలో కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంలో మిత్రపక్షాలు కొన్ని తీవ్ర నిరసన చెప్పాయి. మోదీకి వీసా ఇచ్చేది లేదని అమెరికా స్పష్టం చేసింది. 2002 హింసాకాండ ఆ ఏటి ఎన్నికలలో గెలుపునకు దోహదం చేయగా, మోదీ కొత్తగా అందుకున్న అభివృద్ధి అజెండా 2007లో ఆయనను గెలిపించింది. అయినా, 2002 ఆయనను, అమిత్‌షాను, ఆనాటి అధికారులను వెంటాడుతూనే ఉన్నది.

దేశంలోని అనేక రాష్ట్రాలు మోదీని అవాంఛనీయ వ్యక్తిగానే చూస్తూ వచ్చాయి. మరొకవైపు, మోదీలో ఏదైతే ప్రతికూల అంశమని అనుకున్నారో, దాన్నే ఆరాధించే ధోరణి దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. ముస్లిములకు బుద్ధిచెప్పిన నాయకుడిగా, శీఘ్రంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రిగా ఒక జమిలి వ్యక్తిత్వం మోదీకి ఆపాదిస్తూ, ఆయన ప్రభావాన్ని పెంచే ప్రయత్నాలు జరిగాయి. పార్టీలో కూడా అతని ప్రాబల్యం పెరిగిపోయింది. కాంగ్రెస్‌ వంటి అనుభవశాలి అయిన పక్షమే ఈ క్రమాన్ని సరిగా అంచనా వేయడంలో విఫలం అయింది. మతతత్వం పై సూత్రబద్ధ వైఖరి లేకపోవడం, తరచు దానితో రాజీపడడం, తరచు తాను కూడా దాన్ని ఆశ్రయించడం - ఈ కారణాలతో కాంగ్రెస్‌ పార్టీ మోదీ - షా ద్వయం ఎదుగుదలను నిలువరించలేకపోయింది.

మతతత్వ భావజాలం, నిర్దాక్షిణ్యమైన పరిపాలనాచర్యలు, ప్రచారవ్యూహం - ఇవన్నీ కలిసి భారత అధికార పీఠం మీద అత్యంత ప్రమాదకరమైన శక్తులను ప్రతిష్టించగలిగాయి. రానా అయ్యూబ్‌ పుస్తకం  చదువుతుంటే, ఈ క్రమం అంతా కాలక్రమంలో మన కళ్లముందు దులుతుంది. అనేక ఘటనల మధ్య కార్యకారణ సంబంధం అర్థమైపోతూ ఉంటుంది. 2002లో జరిగింది నిస్సహాయుల మీద దుండగులు జరిపిన మారణకాండ మాత్రమే కాదని, అనంతరం జరిగిన అనేక సంఘటనలు కేవలం స్థానికమయిన అవసరాల కోసం జరిగినవి కావని తెలిసిపోతుంది.

ఈ పుస్తకం పాత్రికేయరంగంలో వచ్చిన బాధాకరమైన మార్పులను కూడా మనకు బోధపరుస్తుంది. సంపాదకీయ ప్రమాణాలకు అనుగుణంగా లేదని, అసమగ్రంగా ఉన్నదని 'తెహెల్కా' యాజమాన్యం ఈ పరిశోధనను ప్రచురించలేదు. చెప్పిన కారణాలు ఏమైనప్పటికీ, వారు పర్యవసానాలకు భయపడి ఉంటారని ఊహించవచ్చు. 'తెహల్కా' చిన్న పత్రిక. అప్పటికే అది తన తాహతుకు మించిన పరిశోధనాత్మక కథనాలను అందించింది. కానీ, జాతీయస్థాయి దిగ్దంత పత్రికలు, మీడియా సంస్థలు కూడా రానా అయ్యూబ్‌ పరిశోధనకు ముఖం చాటు చేశాయి.

రాజకీయ పక్షపాతాలు మోతాదుకు మించిపోయి, మీడియా అధికారక్రీడలో భాగం కావడం ఈ మధ్య పెరిగిపోయిన ధోరణి. ప్రాంతీయ భాషా మీడియా కంటె ఇంగ్లిష్‌, హిందీ పత్రికలు, చానెళ్లు - కనీసం జాతీయ సమస్యల విషయంలో - ధైర్యంగా, నిష్పక్షపాతంగా ఉంటాయన్నది గతంలోని మాట.

ఆర్థిక సంస్కరణల అనంతర కాలంలో రాజకీయాధికారానికీ, కార్పొరేట్‌ పెట్టుబడులకు సంబంధం గాఢమైంది. స్వతంత్ర మీడియా అన్నది అరుదు అయింది. సమాచారహక్కు చట్టరూపం తీసుకున్న తరువాత కూడా, సమాచార సాంకేతికత అనేక వెసులుబాట్లను కల్పిస్తుందన్న ఆర్భాటం తరువాత కూడా, సత్యానికి సంకెళ్లు కొనసాగుతూనే ఉన్నాయి.

ఈ వాస్తవ పరిస్థితిని ఖాతరు చేయకుండా, తనలో సాహసోపేతమైన పాత్రికేయురాలిని, సంకల్పబలం కలిగిన ప్రజాస్వామ్యవాదిని నిలుపుకున్న రానా అయ్యూబ్‌ అభినందనీయురాలు.


కె. శ్రీనివాస్‌
హైదరాబాద్‌,  సంపాదకులు ఆంధ్రజ్యోతి
అక్టోబర్‌ 27, 2016.


ప్రతులకు, వివరాలకు : 

 
మలుపు, 
2-1-1/5 , 
నల్లకుంట, హైదరాబాద్ - 500044 


E MAIL ID : malupuhyd@gmail.com


Phone : 040 2767 8411


Friday 4 November 2016

గుజరాత్ ఫైల్స్ - దుర్మార్గ పాలనపై రహస్య నేత్రం - రానా అయ్యూబ్

గుజరాత్ ఫైల్స్
దుర్మార్గ పాలనపై రహస్య నేత్రం
- రానా అయ్యూబ్


జర్నలిస్ట్ రానా అయ్యూబ్ ఎనిమిది నెలల పాటు అండర్ కవర్ లో ఉంటూ గుజరాత్ మత కల్లోలాలు, బూటకపు ఎన్కౌంటర్లు, రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి హరేన్ పాండ్య హత్యలను దర్యాప్తు చేసి బయటపెట్టిన ఎన్నో విభ్రాంతి కర విషయాల సమాహారమే ఈ "గుజరాత్ ఫైల్స్".

అమెరికన్ ఫిలిం ఇన్స్తి ట్యూట్ కన్జర్వేటరీ నుండి వచ్చిన ఫిల్మ్ మేకర్ మైథిలీ త్యాగిగా రానా అయ్యూబ్  గుజరాత్ రాష్ట్రం లో 2010 మధ్య అత్యంత కీలక పదవుల్లో ఉన్న ఉన్నతాధికారులను,పోలీస్ అధికారులను కలిసింది.

రాజ్యం, దాని అధికారగణం మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు చేయడంలో ఎట్లా భాగాసాములయ్యాయో ఈ స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయట పెట్టిన విషయాలు తెలుపుతాయి.

నరేంద్ర మోదీ, అమిత్ షాలు అధికార శిఖరాలకు ఎగబాకటం కోసం గుజరాత్ నుండి ధిల్లీ దాకా వాళ్ళు చేసిన ప్రయాణానికి సమాంతరంగా నడిచిన కేసుల గురించి ఎన్నో సంచలనాత్మక విషయాలను ఈ పుస్తకం బయటపెడుతుంది .

విచారణ కమిషన్ల ఎదుట మాట్లాడవలసి వచ్చినప్పుడు మతిమరుపు నటించిన వారు రహస్యంగా టేపు చేసిన వీడియోల్లో ఏ ఒక్క విషయమూ దాచు కోకుండా చెప్పిన నిజాలను చాలా ఆసక్తి దాయకంగా ఈ పుస్తకం బయటపెడుతుంది .

మలుపు ప్రచురణగా త్వరలో వెలువడనున్న ఈ పుస్తకం ధర రూ. 130


ప్రతులకు, వివరాలకు : 

 
మలుపు, 
2-1-1/5 , 
నల్లకుంట, హైదరాబాద్ - 500044 


E MAIL ID : malupuhyd@gmail.com


Phone : 040 2767 8411