Saturday 22 April 2017

కాషాయ నీడలో నగరంలో కర్ఫ్యూ - రచన: విభూతి నారాయణ్‌ రాయ్‌, అనువాదం : సమీర


మూడు దశాబ్దాల విషాద చరిత్ర

నగరంలో కర్ఫ్యూ చదువుతుంటే ఇది మూడు దశాబ్దాల క్రితం రాసింది అనిపించదు. ఆ నగరం అక్కడెక్కడో ఉన్న అలహాబాద్‌ అని అస్సలు అనిపించదు. మన హైదరాబాద్‌ పాతబస్తీనే అనిపిస్తుంది. బహుశా ముంబై, సూరత్‌ , మీరఠ్‌లాంటి నగరాల వాళ్లకి కూడా అలానే అనిపించొచ్చు.

స్థలకాలాలు రచయిత చెప్పడం వల్ల మాత్రమే తెలిసే అంశాలు. కొన్ని చరిత్రలు కొన్ని అనుభవాలు కాలగర్భంలో కలిసిపోవడం నాగరికం అనిపించుకుంటుంది. ప్రజాస్వామికం అనిపించుకుంటుంది. అదింకా వర్తమానమే అనిపిస్తున్నదంటే సమాజం ఆ రోగం నుంచి బయటపడలేదని అర్థం. ఇపుడైతే ఆ రోగం మరింత ముదిరి బాహాటంగా ఓట్ల కేంద్రీకరణ రూపం తీసుకోవడం చూస్తున్నాం. దాని విష పరిణామాలను అనుభవిస్తున్నాం. ఈ రోగం కేవలం అధికారంలోకి రావడానికి నిచ్చెనమెట్టు అనే మాటకు పరిమితం చేసి చూడలేం. సంఖ్యను ఆధిపత్యంగా చూపించుకోవచ్చు, దాన్ని అల్పసంఖ్యాకుల మీద తోచిన రూపాల్లో ప్రదర్శించుకోవచ్చు అనే దురాశను సంఖ్యాధిక సమూహంలో కల్పించడం అనేది ఇందులో దాగి ఉండే అంశం.

ఈ విద్వేషపు క్రీడలో శలభాలు ఎప్పుడూ అల్పసంఖ్యాకులు, మార్జినలైజ్డ్‌ సెక్షన్సే. ప్రదేశాన్ని బట్టి దాని పేరు మారొచ్చు. ఒకచోట అది మతం కావచ్చు. మరోచోట జాతీయవాదం ముసుగు తొడుక్కోవచ్చు. రెండూ జమిలిగా డెడ్లీ కాంబినేషన్‌ కావచ్చు. ఒక సమూహం 'ది' అయిపోయి ఇంకో సమూహం 'అదర్‌'; అంటే మనమూ వాళ్లుగా మారిపోయిన పరిభాష, భావజాలం అన్ని పాలనా యంత్రాంగాల్లో జీర్ణించుకుపోయి ఉండడం ప్రమాదకరం. పాలకులు దాన్ని తగ్గించే ప్రయత్నం చేయకపోగా తమ అధికారం కోసం ఎగదోసే వాళ్లైతే ఇక చెప్పనే అక్కర్లేదు. ఇవాళ మనం చూస్తున్నది ఆ ప్రమాదాన్నే. ఇవాళ అదేదో వెనుకబడిన సమాజాలకే పరిమితం అయిన విషయం కాదు. కలల ప్రపంచం అని పేరుపడిన దేశాలు సహా ప్రపంచం యావత్తూ తరతమ బేధాలతో ఈ విద్వేషపు గాలులు వీయడం చూస్తున్నాం. ఈ వాతావరణం ఎంత అమానవీయంగా ఉంటుందో, అల్పసంఖ్యాకులు తాము ఈ సమాజంలో భాగం కాదు అనుకుని దూరమయ్యే ఘెట్టోయైజేషన్‌ ప్రక్రియకు అదెలా దారి తీస్తుందో ఈ చిన్ని పుస్తకం మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది.

కర్ఫ్యూ ఎలా మొదలవుతుంది, మొదలవడానికి ముందే ఎక్కడో పోలీసుల మీద దాడికి ముస్లింలు సన్నాహాలు చేస్తున్నారు అనే ప్రచారం ఎలా మొదలవుతుంది అనేది రచయిత విభూతీ నారాయణ్‌ రాయ్‌ ప్రాక్టికల్‌గా చూపిస్తారు. ఆ నిషిద్ధ కాలంలో ముస్లిం గల్లీల్లో పోలీసులు ఎలా ప్రవర్తిస్తారు, హిందూ గల్లీల్లో ఎలా ప్రవర్తిస్తారు అనేది శక్తిమంతంగా చూపిస్తారు. అన్ని పాలనా యంత్రాంగాల్లో జీర్ణించుకుపోయినది, అదర్‌ అనే భావన చాలా క్రూరమైన రూపాలు తీసుకోవడాన్ని చూపిస్తారు. ప్రజాస్వామిక వాదులకు తెలిసిన విషయాలే కావచ్చును. ఊహించగలిగిన విషయాలే కావచ్చును. కానీ అలాంటి విషయాలు కూడా ప్రతిభావంతమైన రచయిత కలం నుంచి వస్తే అది షాకింగ్‌ ఎఫెక్ట్‌ వస్తుంది. ఇందులో అలాంటి సన్నివేశాలు అనేకం ఉన్నాయి. కర్ఫ్యూలో ఆ గల్లీల్లో కురిసిన వాన లాగే మన మనసుపైనా ముసురు కమ్ముకుంటుంది. చదువుతున్నంత సేపూ చదివిన తర్వాత కూడా ఆ దిగులు మేఘాలు అంత త్వరగా చెదిరిపోవు. కర్ఫ్యూలో కొన్ని దర్వాజాలు, కిటికీలు మూసుకుని ఉండడం మాత్రమే కాదు, తలుపు వెనుక కుర్చీలు, స్టూళ్లూ, సామాన్లు పెట్టి బిక్కుబిక్కు మంటూ గడపాల్సి వస్తుంది. మరికొన్ని దర్వాజాలు, కిటికీలు అపుడపుడు తెరుచుకోవడానికి వీలుగా కూసింత గాలి పీల్చుకునేలా ఉంటాయి. కేవలం ప్రత్యర్థి గుంపులకు సంబంధించిన భయాలే కాకుండా పోలీసులు, జవాన్ల వైఖరి కూడా ఏఏ గల్లీలు పూర్తి చీకట్లో గడపాలో ఏఏ గల్లీలు గాలి పీల్చుకోవచ్చో నిర్ణయిస్తుంది. గాలి ఆడని ఉక్కపోత చీకటి బతుకుల్లో అల్పసంఖ్యాకులవే ఎక్కువ అనేది ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.

 ప్రతి అల్లర్ల సందర్భంలో అటు ఘర్షణల్లోనూ ఇటు కాల్పుల్లోనూ ముస్లింలే ఎక్కువగా మరణిస్తున్నప్పటికీ నేరం వారిమీదే ఎక్కువ మోపడం చూస్తుంటాం. నాయకులకు, వారి బంట్లకు ఏదో ఒక అధికారమో ఆధిపత్యమో అవసరమైనప్పుడల్లా పాకిస్తాన్‌ అనే బూచిని, దాంతో పాటే పోల్చడానికి వీలైన ఆ జెండాను రంగును పదే పదే విద్వేషానికి ఎలా వాడుకుంటారో రచయిత దృశ్యమానం చేశారు. నేను పుట్టక ముందే దేశద్రోహుల జాబితాలో చేరింది నా పేరు అన్న కవి ఖాదర్‌ మొహియుద్దీన్‌ ప్రసిద్ధ వాక్యం గుర్తొస్తుంది. ఈ వ్యవస్థలో తాము భాగస్వాముల మని, తమకు సమాన న్యాయం జరుగుతుందనే నమ్మిక కలగనపుడు ఆ న్యాయం కోసం మనుషులు తమకు తోచిన రూపాలు ఎన్నుకునే అవకాశం ఉంటుంది. అవి అవాంఛనీయ రూపం తీసుకున్నపుడు సాధారణ పౌరుల ఉసురు తీసే ఉగ్రవాదంగా మారినపుడు ఖండించవలసిందే. కానీ దాంతో పాటు వారికి న్యాయం అందేట్టు మనమెంతవరకు ప్రయత్నించాం అనేది సివిల్‌ సొసైటీ ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ముంబై అల్లర్లకు సంబంధించి ఈ ప్రభుత్వాలే నియమించిన శ్రీకృష్ణ కమిషన్‌ సిఫారసులు ఎందుకు బుట్టదాఖలా అయ్యాయన్నది ఆలోచించకుండా గుజరాత్‌ మారణకాండ బాధితులకు ఇవ్వాల్టికీ సరైన న్యాయం ఎందుకు అందట్లేదో ఆలోచించకుండా కేవలం ఉగ్రవాదాన్ని తిట్టిపోయడమో దానితో ముడిపెట్టి ఒక సమూహానికి సమూహాన్ని బోనులో నిలబెట్టడమో ప్రజాస్వామిక మనిపించుకోదు. కనీసం ముస్లిం సమాజ అభ్యున్నతి కోసం అంతో ఇంతో సానుకూల సిఫారసులు చేసిన సచార్‌ కమిటీ నివేదిక ఎందుకు పూర్తిగా అమలు చేయరని ప్రభుత్వాలను ప్రశ్నించకుండా ఎవరో కొంతమంది వ్యక్తుల చర్యలకు మొత్తంగా సమూహాన్ని బాధ్యులు చేసి అనుమానంగా చూడడం ప్రజాస్వామిక మనిపించుకోదు. ఇలాంటి ధోరణి వ్యవస్థల్లో జీర్ణించుకుపోయి ఉన్నన్నాళ్లూ వారికి న్యాయం జరగదు. ఈ ధోరణి ఎంత ప్రమాదకరంగా ఉంటుందో సజీవ ఉదాహరణలతో రచయిత ఇందులో వివరించారు.

ఇందులో దీక్షిత్‌ అనే అతను నాయకుడు కాకుండా అడ్డుకోవడానికి రామకృష్ణ జైస్వాల్‌, హాజీ భద్రుద్దీన్‌ అనే ఇద్దరు పెద్దమనుషులు అల్లర్లను రేపిన తీరు చూస్తే 90ల్లో హైదరాబాద్‌లో రేగిన అర్లర్ల ఉదంతం కళ్లముందు మెదులుతుంది. ఇందులో ఏ మనిషీ అపరిచితుడిలాగా అనిపించడు. పేర్ల మార్పుతో అందరూ మనమెరిగినవారే. మనమెరిగిన పరిస్థితులే. అయినప్పటికీ మనల్ని కదిలించి వేయగలిగిన శక్తి ఈ పుస్తకానికి ఉంది. పోలీస్‌ అధికారిగా పనిచేసిన వ్యక్తి అథెంటిక్‌గా డీటెయిలింగ్‌ చేసిన పుస్తకం ఇది. మొరటు బారిన శాఖలో పనిచేస్తూ ఇంత సున్నితత్వాన్ని మిగుల్చుకున్నందుకు రచయితను అభినందించాలి.

కర్ఫ్యూ అంటేనే కొన్ని ప్రాంతాలను గంపగుత్తగా జైలుగా మార్చేయడం. జైల్లో కనీసం అన్నపానీయాలను అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఇక్కడ అదీ ఉండదు. కర్ఫ్యూ అంటే కడుపు మాడ్చుకోవడమే అనే అర్థం స్థిరపడిన కుటుంబాలు ఉంటాయి. పిల్లలకు మందులు దొరక్క కడుపు కోత అనుభవించే తల్లిదండ్రులుంటారు. అలాంటి ఒక తల్లి సయీదా దుఖ్ఖం ఈ పుస్తకం చదివాక మనల్ని వెన్నాడుతుంది. బతుకంతా భయమూ, విషాదంతో నిండి బండబారిన ఆమె భర్త నిస్సహాయ నిర్లిప్తత మనల్ని భయపెడుతుంది. కనీస గౌరవంతో ఆ పాపకు అంత్యక్రియలు నిర్వహించడం కోసం పాస్‌ల కోసం ఒక తాత పడే వేదన మనల్ని లోపలినుంచి పిండేస్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కర్ఫ్యూ అవసరమే కావచ్చును. కానీ ఎప్పుడు విధించాలి ఎప్పుడు విధించకూడదు అనే అధికారుల విచక్షణ కేవలం వాస్తవిక పరిస్థితుల మీదే ఆధారపడి ఉంటుందా లేక ఆయా ప్రాంతాల మీద ముందస్తుగా ఏర్పరుచుకున్న అభిప్రాయాల మీదా ఉంటుందా అనేది ప్రధానమైన విషయం. సాధారణంగా మెజారిటీ ఆధిపత్యానికి సవాల్‌ ఎదురయ్యే చోట అంటే మైనారిటీలు కాస్త ఎక్కువగా కనిపించే చోట ఇలాంటి ఉపద్రవానికి ఆస్కారం ఎక్కువ. మత ఘర్షణలు అనే పేర జరిగే ప్రచారంలో చాలా విషయాలు మరుగున పడి పోతున్నాయి కానీ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ అల్లర్లు, కర్ఫ్యూల చరిత్ర, గణాంకాలు పరిశీలిస్తే ఇందులో దాగిన అసలు సత్యం బోధపడుతుంది. కర్ఫ్యూ విధించాల్సిన సందర్భంలో విధించకపోయినా అనవసరంగా కొనసాగించినా- రెండు సందర్భాల్లోనూ నష్టపోయేది ఎక్కువలో ఎక్కువ మైనారిటీలేనన్నది విచిత్ర విషాద వాస్తవం.

విషాదం, అన్యాయం మన కామన్‌సెన్స్‌లో భాగమైపోయి అవి అలాగే జరుగుతాయి కదా అని నిర్లిప్తంగా అనుకునే స్థితి మామూలు మంచివాళ్లలో కూడా ఏర్పడడం సమాజపు మొద్దుచర్మానికి నిదర్శనమవుతుంది. చాలా అన్యాయాలు అలాగే అలవాటైపోయి ఈ 'అదర్‌' మీద అంటే ముస్లింల మీదా, ఆదివాసీలు వంటి సమూహాల మీద ఎలాంటి ఘోరాలు జరిగినా పెద్దగా చలించని స్థితి కొన్ని సమూహాల్లో నెలకొని ఉండడం వర్తమాన విషాదానికి పరాకాష్ట. ఏ కొంచెం మానవీయ స్పందనలున్న వారిలోనైనా ఆలోచనలు రేకెత్తించగల ఔషధం లాంటి ఇలాంటి శక్తిమంతమైన రచనలు సమాజానికి అవసరం. పేదలను ఎల్లప్పుడూ ఉన్నతమైన విలువలతోనే చూపించాలనే కృతకమైన బరువు నెత్తిన లేకపోవడం వల్ల కావచ్చు రచయిత సహజంగా పరిస్థితులను చిత్రించగలిగారు. వర్గదృక్పథాన్ని ఆ స్థాయికి కుదిస్తే ప్రయోజనం లేని ప్రాపగాండా అవుతుంది కానీ సాహిత్యం అవదు.

రక్తం అమ్ముకుని సారా తాగే దేవీలాల్‌ తాను హిందూ శవాలను తొక్కకుండా గల్లీలోని ఇల్లు చేరడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో వర్ణించి చెపుతూ ఉంటాడు. బస్తీల్లో ఇలాంటి అర్థం పర్థం లేని ప్రచారాలు సాగుతూనే ఉంటాయి. ఇరుగుపొరుగు ఇళ్లపై దాడులు జరగవు అనే నమ్మకం నమ్మకంగా మిగలదు. ప్రత్యేకించి ఆడపిల్లలున్న అసహాయపు ఒంటరి ఇంటిపై ఇరుగుపొరుగు ఇండ్ల పోరగాళ్ల నుంచే రాళ్లు పడతాయి. అది మరీ శృతి మించినపుడు పెద్దలు ఏదోలా కలుగజేసుకోవడం కూడా ఉంటుంది. కానీ అదే సమయంలో దారి తప్పిన ఒంటరి ఆడపిల్ల షట్లర్ల కింద అత్యాచారానికి బలైపోవడం కూడా ఉంటుంది. కమ్యూనిస్టు భావజాలం ఉన్న కుటుంబాలు కూడా అలా మిగలక తమ మతాన్ని పులుముకోవాల్సిన సన్నివేశం ఏర్పడుతుంది. ప్రాణాలతో ముడిపడిన విషయం ఉన్నపుడు ఆధిపత్యాన్ని ఏ స్థాయిలో ఎంత దుర్మార్గంగా నైనా ప్రదర్శించుకోగలిగిన అవకాశం ఉన్నపుడు మనిషి ఎలా మసులుకుంటాడు అనేది చిక్కు ప్రశ్న. ఇక ఐడెంటిటీ బయటపడకుండా మనిషిలోని జంతువును సంతృప్తిపర్చుకునే అవకాశం ఉన్న చోట మనిషిగా మిగలాలంటే చాలా కావాలి. అలా మిగలాలంటే మంచి సాహిత్యం మంచి రాజకీయాలు కావాలి. ఇదిగో ఇలాంటి పుస్తకాలు మరిన్ని కావాలి. ఉజ్వలమైన ఉద్యమ వారసత్వంతో పాటు అల్లర్ల చరిత్ర కూడా ఉన్న మన గడ్డ నుంచి ఇలాంటి పుస్తకం ఎందుకు రాలేదా అని ఆశ్చర్యమేస్తుంది.

హిందువునని గర్వించు, భారతీయుడిగా గర్వించు అనే పదాలు తరచుగా వింటూ ఉంటాం. రెండు పదాలను ఒకే వేదిక నుంచి వాడినా వాడకపోయినా పర్యాయపదాలుగా వాడే ప్రయత్నం పరోక్షంగా జరుగుతూ ఉంటుంది. ఈ మనమూ- వాళ్లూ పరిభాష ఢిల్లీ నుంచి గల్లీదాకా నిలిచి ఉండేలా కొన్ని శక్తులు పనిచేస్తూ ఉంటాయి. అసలు ఇక్కడ గర్వం అనే పద ప్రయోగమే చిత్రమైనది. దేన్ని చూసి గర్వించాలి?

గర్వం అన్నపుడు ఇంకేదానితోనో పోలిక అంతర్గతంగా ధ్వనిస్తుంది. ఇంకెక్కడో న్యూనత సృష్టిస్తేనే ఇక్కడ గర్వం ఉంటుంది- ఎవరే భాష్యం చెప్పినప్పటికీ! ఆ ఇంకేదో కొన్ని సందర్భాల్లో పాకిస్తాన్‌ కావచ్చు. మరికొన్ని సందర్భాల్లో మన ముస్లింలు కావచ్చు. పాకిస్తాన్ను అవసరమున్నా లేకపోయినా సాకుగా పెట్టి ముస్లింలను అవమానించి హిందువులు గర్వించేలా చేయడానికి బోలెడన్ని సందర్భాలను ఎంచుకుంటూ ఉంటారు. హైదరాబాద్లో ముఖ్యంగా పాతబస్తీ వీధులగుండా సాగే శోభాయాత్రలో ఉపయోగించే సింబాలిజం దీనికి పరాకాష్ట. కేవలం ఇటువంటి విద్వేషాన్ని సింబాలిజాన్ని మాత్రమే ఖండిస్తే సరిపోదు. మొత్తంగానే గర్వించు అనే పరిభాషనే ఎదుర్కోవాలి. ఎవరైనా ఏ పుట్టుకనైనా చూసుకుని ఎందుకు గర్వించాలి. పుట్టుక ఆధారంగా ఏ గుణగణాలను ఆపాదించినా ఏ గర్వాన్ని- న్యూనతను ఆపాదించినా అది విద్వేష భావజాలమే. కులమైనా, మతమైనా, ప్రాంతమైనా ఇంకేదైనా సరే!

హిందువునని గర్వించు దగ్గర్నుంచి అమెరికన్స్‌ ఫస్ట్‌- అమెరికా ఫస్ట్‌ దాకా అన్నింటా తరతమ బేధాల్లో వినిపించేది కనిపించేది అదే. కేవలం విద్వేష రూపాల్నే కాదు. వాటి మూలాలను కూడా ఎదుర్కోవాలంటే మొత్తంగా జాతీయ వాదం పేరుతో సాగుతున్న తంతును కూడా వ్యతిరేకించాలి. దేశభక్తి ప్రదర్శనా వస్తువుగా మారడం, అయినదానికి కానిదానికి దాన్ని ప్రదర్శించుకోవాల్సిన ఒత్తిడిలోకి పౌరుల్ని నెట్టడం ప్రమాదపు సంకేతాలు. ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే మొత్తంగా జాతీయవాదంలోనే దాగున్న ఆ ప్రమాదపు సంకేతాలను వివరించి ఎదుర్కోవాల్సి ఉంది. జాతీయ వాదం నిర్దుష్ట సందర్భంలో ముందుకు వచ్చిన భావన. ఆధునిక రాజ్యాల అవతరణతో ముడిపడిన ఆ కాలపు భావన. కాలక్రమేణా అది విశాలం కావాలి తప్పితే ఇరుకు కాకూడదు. విశాలత్వాన్ని కోరుకునే వారు ఈ ఇరుకు ప్రయత్నాలను ఎదుర్కోవాలి. సమాజంలో మార్పు కోరుకునే వారు దీనిపై మరింత శక్తిని సమాయాన్ని కేటాయించాలి.

- జి ఎస్‌ రామ్మోహన్‌
(తెలుగు ప్రచురణకు ముందుమాట)

కాషాయ నీడలో నగరంలో కర్ఫ్యూ
ఆంగ్ల మూలం : కర్ఫ్యూ ఇన్‌ ది సిటీ
రచన :  విభూతి నారాయణ్‌ రాయ్‌
అనువాదం : సమీర

కవర్‌ డిజైన్‌ : రమణజీవి
కవర్‌ ఫోటో : వికార్‌ సయ్యద్‌
 ధర : రూ. 75/-

ప్రచురణ : మలుపు,
ప్రతులకు : 2-1-1/5, నల్లకుంట, హైదరాబాద్‌ - 500 044, తెలంగాణ.

No comments:

Post a Comment